ఇతరుల కాల్ హిస్టరీ పేరుతో చీటింగ్.. 28 ఆండ్రాయిడ్ యాప్‌లు ఎలా మోసం చేశాయంటే?

  • గూగుల్ ప్లేలో 28 యాప్‌లను గుర్తించినట్లు సెక్యూరిటీ రీసెర్చ్ సంస్థ వెల్లడి
  • ఈ స్పామ్ యాప్‌లకు 'కాల్ ఫాంటమ్' అని నామకరణం
  • గూగుల్ ప్లే స్టోర్ నుంచి 73 లక్షలకు పైగా డౌన్‌లోడ్‌లు
ఇతరుల కాల్ హస్టరీని వెల్లడిస్తామని, అలాగే మీకు కాల్ చేసిన వ్యక్తుల వివరాలను వెల్లడిస్తామని చెబుతూ గూగుల్ ప్లే స్టోర్ నుంచి వినియోగదారులు డౌన్ లోడ్ చేసుకున్న 28 స్పామ్ యాప్‌లను గుర్తించారు. ఈ స్పామ్ యాప్స్ యూజర్ల నుంచి డబ్బులు కూడా వసూలు చేసి నకిలీ సమాచారాన్ని అందించాయి. ఈ మేరకు సెక్యూరిటీ రీసెర్చ్ సంస్థ ఈఎస్ఈటీ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.

కాల్ హిస్టరీ వెల్లడిస్తామని, మీకు కాల్ చేసిన వ్యక్తుల వివరాలను అందిస్తామనే హామీతో ఈ స్పామ్ యాప్‌లను లక్షలాది మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ నకిలీ యాప్‌లకు 'కాల్‌ఫాంటమ్' అని నామకరణం చేసారు. ఈ యాప్‌లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి 73 లక్షలకు పైగా డౌన్‌లోడ్‌లు నమోదు చేశాయి.

ఈ 28 ఆండ్రాయిడ్ యాప్‌లు ఎలా మోసం చేశాయి?

వినియోగదారుడు ఇచ్చిన ఏ ఫోన్ నెంబర్ ప్రైవేటు కాల్స్, ఎస్సెమ్మెస్ రికార్డులు, వాట్సాప్ కాల్ హిస్టరీని అయినా ఇవ్వగలమని ఈ నకిలీ యాప్స్ నమ్మించాయి. వాస్తవానికి ఈ యాప్‌లు నకిలీ డేటాను సృష్టించి, కల్పిత ఫలితాలను అందిస్తూ, సబ్‌స్క్రిప్షన్ కోసం వినియోగదారుల నుంచి డబ్బులు కూడా వసూలు చేశాయి.

భద్రతా పరిశోధక సంస్థ ఈఎస్ఈటీ వెల్లడించిన ప్రకారం, 'కాల్ హిస్టరీ ఆఫ్ ఎనీ నెంబర్' అనే యాప్ గురించి రెడ్డిట్ పోస్టులో గుర్తించిన అనంతరం పూర్తి వివరాలు తెలుసుకోవడానికి విచారణ ప్రారంభించారు. 'ఇండియన్ గవర్నమెంట్.ఇన్' అనే డెవలపర్ పేరుతో ఈ పోస్టు ఉంది. దీని ప్రకారం వినియోగదారుడు అందించిన ఏ ఫోన్ నెంబర్ కాల్ హిస్టరీనైనా తిరిగి పొందవచ్చు.

అయితే ఈ యాప్‌నకు భారత ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేదు. అంతేకాదు, ఇది అందించిన కాల్ హిస్టరీ డేటా పూర్తిగా కల్పితమని కూడా రీసెర్చర్స్ గుర్తించారు. గూగుల్ ప్లే స్టోర్‌లో ఇలాంటి మరో 27 యాప్‌లను పరిసోధకులు గుర్తించారు. 2025 డిసెంబర్ 16వ తేదీన ఈ యాప్‌ల గురించి గూగుల్‌కు నివేదించినట్లు ఈఎస్ఈటీ తెలిపింది. ఆ తర్వాత వాటన్నింటిని గూగుల్ ప్లే యాప్ స్టోర్ నుంచి తొలగించారు.

ఈ యాప్‌‍లకు సంబంధించి మరో ఆందోళనకరమైన విషయం ఏమంటే, ఈ యాప్స్ భారతదేశం, ఆసియా - పసిఫిక్ ప్రాంతాల వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ యాప్‌లలో చాలా వరకు మన దేశం యొక్క +91 కంట్రీ కోడ్‌ను ముందే ఎంచుకుని ఉంటాయి. వీటి ద్వారా యూపీఐ చెల్లింపులు కూడా జరపవచ్చు. ఈ యాప్‌ల సబ్‌స్క్రిప్షన్ ధరలు విభిన్నంగా ఉంటాయి. వార్షిక ప్లాన్ కోసమైతే 80 డాలర్ల వరకు, పరిమిత స్థాయి సబ్‌స్క్రిప్షన్ అయితే 5 డాలర్ల వరకు వసూలు చేస్తున్నాయి.

CallPhantom
call history
android apps
spam apps
google play store
data theft
fake data
ESET

More Telugu News